Skip to content

సెక్యులర్ మడిబట్ట జాగ్రత్త!

March 30, 2014

సెక్యులర్ మడిబట్ట జాగ్రత్త!

ఇండోనేసియా ప్రపంచంలోకెల్లా పెద్ద ముస్లిం దేశం. అక్కడి జనాభాలో నూటికి 87 మంది మహమ్మదీయులు. తమ సాంస్కృతిక మూలాలను ఇండోనేసియన్లు మరచిపోరు. ఏవగించుకోరు.
అక్కడి నేషనల్ ఎయిర్‌లైన్ పేరు ‘గరుడ’
(ప్రస్తుతం మూతపడ్డ) డొమెస్టిక్ ఎయిర్‌లైన్ పేరు ‘జటాయు’.
ఇండోనేసియన్ కరెన్సీ నోటుమీద గణేశుడి బొమ్మ!
రాజధాని జకార్తాలో ముఖ్యకూడలివద్ద అర్జునుడికి కృష్ణుడు రథం మీద గీతోపదేశం చేస్తున్న నిలువెత్తు ప్రతిమ!!
గరుత్మంతుడు, జటాయువు, కృష్ణుడు, గణేశుడు హైందవ మత సంబంధంగల పేర్లు. తమ దేశంలో హిందూమతం శతాబ్దాలకిందటే దాదాపుగా అంతరించిపోయి, ఐదింట నాలుగొంతుల జనాభా ఇస్లాం మతాన్ని తరతరాలుగా ఆచరిస్తుండగా… తమదికాని, … అందునా విగ్రహారాధకుల మతం తాలూకు పేర్లను ప్రభుత్వ సంస్థలకు పెట్టటమేమిటి? ప్రభుత్వ కరెన్సీపై అన్యమతానికి చెందిన దేవతామూర్తిని ముద్రించటమేమిటి?… అన్న అభ్యంతరం ఇండోనీసియన్లకు లేదు. తమ ప్రాచీన హిందూ సంస్కృతి అన్నా, వాటి ప్రతిరూపాలన్నా వారికి మహా ఇష్టం.
కొద్దినెలల కిందటి ముచ్చటే చూడండి. ముస్లిం దేశమైన ఇండోనేసియా, (ప్రధానంగా) క్రైస్తవ దేశమైన అమెరికాకు 16 అడుగుల ఎత్తు సరస్వతీదేవి విగ్రహాన్ని కళాత్మకంగా చెక్కించి, స్నేహానికి గుర్తుగా పంపించింది. వేరే మతానికి చెందిన దేవతావిగ్రహాన్ని ప్రభుత్వ కానుకగా పంపించటం అపరాధమని ఇండోనేసియా సర్కారు అనుకోలేదు. తమది కాని మతం ప్రతిమను తామెందుకు తీసుకోవాలని అమెరికన్ గవర్నమెంటూ చిరాకు పడలేదు. సంతోషంగా దాన్ని స్వీకరించి, వాషింగ్టన్ డి.సి.లో వైట్ హౌసుకు కిలోమీటరు దూరంలో టూరిస్టులకు ప్రత్యేకాకర్షణగా దాన్ని ఉంచారు.
పైన చెప్పుకున్న వాటిలో ఏ ఒక్కదాన్నయినా ఇండియా దటీజ్ సెక్యులర్ భారత్‌లో కలనైనా ఊహించగలమా?
కర్మంచాలక అదే సరస్వతీదేవి విగ్రహాన్ని అమెరికాకు కాక ఇండియా సర్కారుకు ఇండోనేసియా బహూకరించిందనుకోండి! ఏమయ్యేది? విగ్రహం ఎంత ముచ్చటగా ఉంటేనేమి? అది ఒక మతానికి సంబంధించినది కదా? ఆ మతం ఎంత ప్రాచీనమైనది అయితే మాత్రమేమి? మా దేశంలో నూటికి 80 మంది ఇప్పటికీ అనుసరిస్తున్నదే అయితే నేమి? ఫలానా మతానికి చెందిన దేవతా ప్రతిమను ముట్టుకుంటే మా సెక్యులర్ మడి మైలపడుతుంది. కాబట్టి వద్దే వద్దని ఘనత వహించిన భారత సర్కారు ఆ కానుకను తిరుగు టపాలో వెనక్కి పంపించేది. సమయానికి సెక్యులర్ మతి తిన్నగా పనిచేయక మన్మోహన్ సర్దార్జీగారో, మరో పెద్దతలకాయో ఆ విగ్రహాన్ని స్వీకరించి ఉంటేనా…?! దేశంలోని సెక్యులర్, లిబరల్, లెఫ్టిస్టు, అనార్కిస్టు తక్కుంగల మేధావిగణం యావత్తూ రేచుకుక్కల్లా మీదపడి పీకిపెట్టేది. జాతి ఎంచుకున్న సెక్యులర్ జీవన విధానానికి, రాజ్యాంగ వౌలిక స్ఫూర్తికి, మానవతా విలువలకు జరిగిన ఆ మహాపచారం సభ్య సమాజానికి సిగ్గుచేటు అంటూ ‘ది హిందూ’ పత్రిక ఘాటైన సంపాదకీయం రాసేది. వీరనారి అరుంధతీరాయ్ డిటోడిటోగా ‘ఔట్‌లుక్’ వీక్లీనిండా చెడామడా చెలరేగేది. పాఠశాలల్లో, పబ్లిక్ కార్యక్రమాల్లో సరస్వతీ ప్రార్థన చేయటమే సెక్యులర్ వ్యతిరేక దురాగతమని జాతీయ ఏకాభిప్రాయం ఎంచక్కా నెలకొని ఉన్న పవిత్ర భారతదేశంలో బాధ్యతగల ప్రభుత్వమే బరితెగించి ఏకంగా సరస్వతీ విగ్రహానే్న అందుకోవటాన్ని రాజ్యాంగ వ్యతిరేక దుశ్చర్యగా ప్రకటించమంటూ వీర సెక్యులరిస్టులు ఏ ఉన్నత న్యాయస్థానంలోనో అర్జంటుగా ప్రజాహిత వ్యాజ్యం వేసేవారు.
-ఇప్పుడు బృహదీశ్వరాలయం బొమ్మతో ప్రత్యేక నాణేన్ని రిజర్వు బ్యాంకు చలామణీ చేయడం మీద ఢిల్లీ హైకోర్టులో లక్షణమైన ‘పిల్’ పడ్డట్టు!
పనిలేనివాడు దావావేస్తేనేమి? అన్నీ తెలిసిన న్యాయస్థానం అడ్డగోలు వాదాన్ని ఎందుకు మన్నిస్తుంది – అంటారా?
తాజా నాణెం కేసులో ఏమయింది?
బృహదీశ్వరాలయం బొమ్మతో మూడేళ్ల కింద రిజర్వు బ్యాంకు ప్రత్యేక నాణేన్ని వెలువరించింది తంజావూరు గుడికీ హిందూ మతానికీ వల్లమాలిన పబ్లిసిటీ తెచ్చిపెట్టటానికి కాదు. ప్రపంచ హెరిటేజ్ సెంటరుగా ‘యునెస్కో’ గుర్తింపు పొంది, కళాత్మక నిర్మాణ వైభవానికి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆ పెద్ద గుడికి వెయ్యేళ్లు నిండిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన కార్యమది. అయితేనేమి? సెక్యులరిజం మంట కలిసిందంటూ నఫీస్ కాజీ, అబూ సరుూద్ అనే ఇద్దరు ఢిల్లీ పౌరులు ప్రజాహితవ్యాజ్యం వేసీ వెయ్యగానే అన్నీ తెలిసిన ఢిల్లీ హైకోర్టు న్యాయపీఠం ప్రభుత్వంమీద ఫైర్ అయింది. మీపై వచ్చిన అభియోగానికి ఏమంటారో చెప్పుకోమని కేంద్ర ప్రభుత్వానికీ, రిజర్వుబ్యాంకుకు నోటీసులిమ్మని ఆదేశించిన యాక్టింగ్ చీఫ్ జస్టిస్ బి.డి. అహమ్మద్‌గారు ఆ సమాధానమేదో వచ్చేదాకా ఆగకుండానే ప్రభుత్వానికి సెక్యులర్ వ్రత విధానం గురించి పెద్ద క్లాసు తీసుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయానికి వెయ్యేళ్లు నిండిన అరుదైన సందర్భాన్ని పురస్కరించుకునే నాణేన్ని వెలువరించామని ప్రభుత్వం పనుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం ఏ ఒక్క మతానికీ ప్రచారం చేయరాదు; సెక్యులరిజాన్ని సక్రమంగా అర్థం చేసుకోవలెను అంటూ ఎడాపెడా ఉతికేశారు. పాతికేళ్లకు ఇది, వందేళ్లకు అది అంటూ తడవతడవకూ ప్రత్యేక నాణేలేమిటని తెగచిరాకు పడ్డారు. శభాష్!
న్యాయం, ధర్మం సర్వం ఎరిగిన ఉన్నత న్యాయస్థానం వారి ఉపదేశమే ఈ రీతిన ఉన్నప్పుడు ప్రాచీన కళలను, సంస్కృతిని రూపుమాపడమే సెక్యులర్ సర్కారు స్పెషల్ డ్యూటీగా పెట్టుకుని, ఓటు బ్యాంకుల కోసం ఎంత చేటుపనికైనా ఉరకలేయడంలో వింతేముంది? శ్రీనగర్ దాల్ సరస్సు దాపున ఉండే జగత్ప్రసిద్ధి చెందిన ‘శంకరాచార్య హిల్’ను ‘తఖ్త్-ఎ-సులేమాన్’గా పేరుమార్చి, కొత్త చరిత్రను బనాయించే పవిత్ర కార్యాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎ.ఎస్.ఐ.) వారు రాజకీయ యజమానుల పురమాయింపు మీద జయప్రదంగా పూర్తిచేశారు. తమ కబంధ హస్తాల్లో చిక్కిన ఎన్నో ప్రాచీన దేవాలయ కట్టడాలను ‘పరిరక్షణ’ పేరిట కూల్చి కుప్పపోసే మహత్కార్యక్రమంలో ఈ సర్కారీ సంస్థ వారు ఔరంగజేబు ఆవహించినట్టు చాలాకాలం నుంచీ నిర్ణిద్ర దీక్షతో పాటుపడుతున్నారు. హిందూ మతం గురించి, హిందూ సంస్కృతి గురించి, వాటి సంరక్షణ గురించి మాట్లాడితే ‘సెక్యులర్’ శీలం చెడి, కమ్యూనల్ ముద్ర పడుతుంది కనుక హిందూ సంస్థల పెద్దలూ నోళ్లు కుట్టేసుకున్నారు.
ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి సెక్యులరిజం నేర్పింది. ప్రపంచాన్ని చూసి భారతదేశం సెక్యులరిజాన్ని నేర్చుకోవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది.
Advertisements

From → Vyasapeetham

Leave a Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: